
ఢిల్లీ, 19 మార్చి (హి.స.)
ఇండియన్ రైల్వేస్ ను పంచ స్థాయి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కార్యాచరణను అమలు చేస్తోంది. పట్టాలపై అక్రమ ప్రవేశాలను అడ్డుకోవడమే కాకుండా, రైళ్ల వేగాన్ని పెంచే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 16,398 కి.మీ. మేర రక్షణ కంచె (సేఫ్టీ ఫెన్సింగ్) నిర్మాణాన్ని చేపట్టనుంది. ఇందులో సింహభాగం దక్షిణ మధ్య రైల్వేలో ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా గంటకు 110 కి.మీ కంటే ఎక్కువ వేగంతో రైళ్లు ప్రయాణించే మార్గాల్లో, ప్రమాదకరంగా భావించే ప్రాంతాల్లో ఈ కంచెలను ప్రాధాన్యత క్రమంలో నిర్మించనున్నారు. సేఫ్టీ ఫెన్సింగ్ వల్ల రైల్ వేగం పెరగడమే కాకుండా ఇంధన పొదుపునకు కూడా అవకాశం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
రైల్వే ట్రాక్ల వెంబడి కంచె ఏర్పాటు చేయడం వల్ల ప్రధానంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయి. అత్యధిక వేగంతో (గంటకు 110 కి.మీ కంటే ఎక్కువ వేగంతో) ప్రయాణించే సెక్షన్లలో ట్రాక్ క్లియరెన్స్ బాగుంటుంది. పట్టాలపైకి పశువులు, మనుషులు రాకుండా ఉండటం వల్ల రైళ్లు తరచుగా అత్యవసర బ్రేకులు వేయాల్సిన అవసరం తప్పుతుంది. ఫలితంగా గణనీయమైన స్థాయిలో ఇంధన పొదుపు సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2026-27లో రైల్వే భద్రత కోసం కేటాయించిన నిధులతో సేఫ్టీ ఫెన్సింగ్ నిర్మాణాలు చేపట్టనున్నారు.
ట్రాక్ భద్రతలో సార్త్ సెంట్రల్, సౌత్ సెంట్రల్ రైల్వేలకు ప్రాధాన్యం దక్కింది. నార్త్ సెంట్రల్ రైల్వేకు 2,721 కి.మీ, సౌత్ సెంట్రల్ రైల్వేకు 2,326 కి.మీ వెస్ట్రన్ రైల్వే 2,257 కి.మీ, నార్త్ వెస్ట్రన్ 1,539 కి.మీ, వెస్ట్ సెంట్రల్ 1,415 కి.మీ, సెంట్రల్ రైల్వే 966 కి.మీ, సదరన్ రైల్వే 827 కి.మీ, ఈస్ట్రర్న్ రైల్వే 754 కి.మీ, నార్తర్న్ రైల్వే 736 కి.మీ, ఈస్ట్ సెంట్రల్ 730 కి.మీ, నార్త్ ఈస్టర్న్ రైల్వే 613 కి.మీ, ఈస్ట్ కోస్ట్ రైల్వే 533 కి.మీ, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 365 కి.మీ, సౌత్ వెస్టర్న్ 255 కి.మీ, సౌత్ ఈస్టర్న్ 209 కి.మీ, నార్త్ ఈస్ట్ ఫ్రంటేయర్ రైల్వే 153 కి.మీ... మొత్తం 16398 కి.మీ రైల్వే ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
కేవలం కంచె వేయడమే కాకుండా, స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగకుండా రైల్వే శాఖ పెడెస్ట్రియన్ సబ్వేలను కూడా నిర్మిస్తోంది. లోనావాలా-పుణే-దౌండ్ మార్గంలో 290 కి.మీ ఫెన్సింగ్ కోసం రూ. 209.38 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇప్పటికే 150 కి.మీ పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో మనుషులు, పశువులు సురక్షితంగా దాటడానికి వీలుగా ప్రత్యేకంగా సబ్వేలు నిర్మిస్తున్నారు. ఇదే విధంగా దేశవ్యాప్తంగా గుర్తించిన మార్గాల్లో ఫెన్సింగ్ లు ఏర్పాటు చేసిన తర్వాత స్థానికంగా రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు సబ్ వేలు నిర్మించేందుకు రైల్వే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV