
ఢిల్లీ, 19,మార్చి (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికార-ప్రతిపక్ష సభ్యులంతా ఒకే చోట చేరారు. ఇందుకు రాష్ట్రపతి భవన్ వేదికైంది. ప్రధాని మోడీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ, కేంద్రమంత్రులంతా ఒకే ఫ్రేమ్లో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సహజంగా పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు అధికారు-ప్రతిపక్ష సభ్యులు కారాలు-మిరియాలు నూరుకుంటారు. ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటుంది. అలాంటిది బుధవారం రెండు పక్షాలకు చెందిన సభ్యులంతా ఒకే ఫ్రేమ్లోకి వచ్చారు.
వచ్చే నెలలో కొంత మంది రాజ్యసభ సభ్యులు సభ నుంచి నిష్క్రమించనున్నారు. ఇప్పటికే కొంత మంది పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు రాజ్యసభలో వీడ్కోలు సభ నిర్వహించారు. అనంతరం రాష్ట్రపతి భవన్లో అందరూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఎదుట కలిసి ఫొటో దిగారు. ప్రధాని మోడీ పక్కన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కూర్చోగా.. ఇక ముందు వరుసలో మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజుజ్, అధికార-ప్రతిపక్ష ఎంపీలంతా ఫొటోలో కనిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ