
తిరుమల, 20 మార్చి (హి.స.)ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆధ్యాత్మిక, అభివృద్ధితో పాటు శాంతిబాటలో నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం, భూలోక వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. తెలుగు నూతన సంవత్సర ఆది పర్వదినమైన 'శ్రీ పరాభవ' నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఆయన తిరుమల క్షేత్రానికి చేరుకున్నారు. గురువారం ఉదయం విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం పలకగా, టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, ఈ పవిత్రమైన ఉగాది రోజున శ్రీవారి పాదాల చెంత గడపడం తనకు ఎంతో ఆధ్యాత్మిక సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ వేంకటేశ్వరుడిని వేడుకున్నాను. ముఖ్యంగా మన దేశానికి వెన్నెముకైన రైతులకు ఈ ఏడాది మంచి పంటలు పండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో రాష్ట్రం, దేశం తులతూగాలని మనసారా ప్రార్థించాను అని ఆయన తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV