
అమరావతి, 21 మార్చి (హి.స.)వినియోగదారుల న్యాయ ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో వివాదాల పరిష్కార కమిషన్ సామర్థ్యాలను తొలిసారి పరిశీలించిన ఇండియా జస్టిస్ రిపోర్టు (ఐజేఆర్) విడుదల చేసిన ‘వినియోగదారుల న్యాయ నివేదిక-2026’ ఈ వివరాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 19 పెద్ద, మధ్యతరహా రాష్ట్రాల జాబితాలో వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ల ద్వారా వినియోగదారులకు న్యాయం అందించడంలో 10 మార్కులకు గాను 6.28 మార్కులు సాధించి ఏపీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తర్వాతి స్థానాల్లో వరుసగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం 2.20 మార్కులతో అట్టడుగున 19వ స్థానానికి పరిమితమైంది. దేశంలోని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ల పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించడం ఇదే ప్రథమం. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ), పార్లమెంట్ నుంచి తీసుకున్న సమాచారం, వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టం-2019లోని లక్ష్యాలను అమలు చేయడంలో కమిషన్ల సమర్థత ఆధారంగా ‘వినియోగదారుల న్యాయ నివేదిక’ను రూపొందించారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వం వహించారు. బడ్జెట్, మౌలిక వసతులు, మానవ వనరులు, పని భారం, లింగ వైవిధ్యం తదితర అంశాలను కొలమానంగా తీసుకుని ఈ ర్యాంకులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్లకు అధ్యక్షుల కొరత కేవలం 6 శాతం కాగా.. సభ్యుల కొరత 3 శాతం మాత్రమే. 2025 నాటికి రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్కు అధ్యక్షుడు లేరు. సభ్యులలో 25 శాతం కొరత ఉంది.
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కేవలం 17 జిల్లాల్లో మాత్రమే వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లు ఉన్నాయి. అయినప్పటికీ 2020 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలోని వినియోగదారుల కేసుల్లో దాదాపు 93 శాతం కేసులు పరిష్కారమయ్యాయి. మూడేళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసుల్లో రాష్ట్రం వాటా అతి తక్కువగా కేవలం 5 శాతం మాత్రమే ఉన్నట్లు ఐజేఆర్ నివేదిక వెల్లడించింది. ప్రతి మూడు కేసుల్లో ఒకటి బీమా రంగానికి సంబంధించిన ఫిర్యాదు కాగా.. తర్వాతి స్థానాల్లో గృహ నిర్మాణం (12 శాతం), బ్యాంకింగ్ కార్యకలాపాల (11 శాతం)కు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. మొత్తం ఫిర్యాదుల్లో కేవలం 25 శాతం కేసులను మాత్రమే 3 నెలల నిర్దేశిత కాలపరిమితి లోపు పరిష్కరించినట్లు వెల్లడించింది. అయితే దేశంలోని అనేక రాష్ట్ర కమిషన్లలో సగానికంటే ఎక్కువ అధ్యక్షులు, సభ్యుల పదవులు ఖాళీగా ఉండటం, అధిక శాతం జిల్లాల్లోనూ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్లు ఏర్పాటు కాకపోవడం ఆందోళన కలిగించే అంశమని ఐజేఆర్ నివేదిక ఆక్షేపించింది. ఈ నివేదిక ప్రకారం.. 2020 నుంచి 2024 మధ్య పెండింగ్ కేసులు 87,545 నుంచి 5.15 లక్షలకు పెరిగాయి. మొత్తం పెండింగ్ కేసుల సంఖ్య 21 శాతం పెరిగింది. వినియోగదారుల భద్రత చట్టం ప్రకారం 3-5 నెలల కాలపరిమితిలోగా వీలైనంత త్వరగా కేసులు పరిష్కరించాల్సి ఉంది. కాగా దేశవ్యాప్తంగా మూడోవంతుకు పైగా కేసులు మూడేళ్లకు పైగా అపరిష్కృతంగా ఉన్నాయి. కేరళ, జమ్ము కశ్మీర్, జార్ఖండ్లలో అయితే పెండింగ్ కేసులు భారీగా ఉన్నాయి. ప్రతి మూడు కేసుల్లో రెండింటికి పైగా (70 నుంచి 80 శాతం) మూడేళ్లకుపైగా అపరిష్కృతంగా ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్