
హైదరాబాద్, 20 మార్చి (హి.స.)కడప ఎంపీ అవినాశ్రెడ్డిపై పులివెందుల తెలుగుదేశం ఇన్చార్జ్ బీటెక్ రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాశ్రెడ్డి ప్రెస్మీట్ చూస్తే ఆస్కార్ అవార్డు ఇచ్చే రేంజ్లో ఉందని ఎద్దేవా చేశారు. ఈరోజు(శుక్రవారం) కడప జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో బీటెక్ రవి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు గురించి అవినాశ్రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వివేకా కుమార్తె సునీత సీఎం చంద్రబాబుకు సహకరిస్తున్నారని అవినాశ్రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
సునీతకు రాజకీయాలపై ఆసక్తి ఉంటే అవినాశ్రెడ్డి కడప ఎంపీ కాలేరని.. ఆ స్థానంలో సునీత ఎంపీ అయ్యేవారని బీటెక్ రవి చెప్పుకొచ్చారు. వివేకా హత్య కేసు గురించి అవినాశ్ చెబుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయని సెటైర్లు గుప్పించారు. ‘స్పాట్ పెట్టింది మీరు.. స్పాట్కు పోయింది మీరు.. స్పాట్లో దగ్గరుండి సాక్ష్యాధారాలను క్లీన్ చేయిచ్చిందే అవినాశ్రెడ్డి’ అని ఆరోపించారు. వివేకా కేసులో అవినాశ్రెడ్డి శిక్ష నుంచి తప్పించుకోలేరని బీటెక్ రవి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్