
హైదరాబాద్, 20 మార్చి (హి.స.)
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో రోడ్లు, స్ట్రీట్ లైట్స్ నిర్వహణకు టెండర్లు పిలవడానికి ప్రభుత్వం పరిపాలన అనుమతిచ్చింది. టెండర్లు పిలవడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే మూడు కార్పొరేషన్లలో ఒకే సారి పిలవాలా? లేదా? అనేదానిపై క్లారిటీ కోసం ప్రభుత్వానికి లేఖ రాశారు. అధికారులు మాత్రం టెండర్ నోటిఫికేషన్ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం.
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణను పదేండ్ల పాటు కాంట్రాక్టర్లకు అప్పగించేలా ప్రభుత్వం నిర్ణయించింది. టీసీయూఆర్ పరిధిలో 7,60,591 స్ట్రీట్ లైట్లను అధికారులు గుర్తించారు. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో రూ.1341.6 కోట్లతో స్ట్రీట్ లైట్లను నిర్వహించనున్నారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో సింగిల్ టెండర్ నిర్వహించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
స్ట్రీట్ లైట్ల నిర్వహణకు సంబంధించి గతంలో ఉన్న విధానానికి కాస్త భిన్నమైన విధానాన్ని అనుసరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కేవలం వెలిగే లైట్లకు మాత్రమే మెయింటనెన్స్ చార్జీలను చెల్లించేలా అధికారులు టెండర్లలో మార్పులు చేయనున్నారు. ఢిల్లీ తరహా విధానాన్ని కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోనూ అమలు చేయనున్నారు. ఇదే విధానాన్ని ఇక్కడ అమలు చేసేందుకు కాకతీయ ఎనర్జీ సర్వీసు లిమిటెడ్ అనే సంస్థ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కానీ ఢిల్లీలో కేవలం 3.96 లక్షల స్ట్రీట్ లైట్లుండగా, పన్నెండేళ్ల మెయింటనెన్స్ పీరియడ్కు అక్కడి అధికారులు రూ.1,030 కోట్లను చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ) ద్వారా ఒక్కో లైట్ల మెయింటనెన్స్ చార్జీలు రూ.186 కోట్ చేస్తూ ఓ ఏజెన్సీ ప్రతిపాదనాలు అందజేసినట్టు తెలిసింది. అయితే ఇది రూ.200 వరకు గానీ పెరిగే అవకాశంతో పాటు రూ.175కు తగ్గే అవకాశాలున్నాయి.
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ఏరియాల్లో 1,045 కిలోమీటర్లను రూ.3,145 కోట్లతో నిర్వహించడానికి జీహెచ్ఎంసీ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. రోడ్ల నిర్వహణతోపాటు లేన్ మార్కింగ్ ఏడాదికోసారి చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు