
హైదరాబాద్, 20 మార్చి (హి.స.)
తెలంగాణ శాసనసభలో 2026-27
ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు రూ.13,679 కోట్ల నిధుల కేటాయింపు చేస్తున్నామని భట్టి విక్రమార్క అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం అయిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(EHS)ను ప్రారంభిస్తున్నట్టు భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రంలోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు 421 ఎంప్యానెల్ ప్రయివేట్ ఆసుపత్రుల్లో 1,998 వ్యాధులకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చికిత్స పొందవచ్చని తెలియజేసారు.
ఇందులో భాగంగా ప్రతి ఉద్యోగికి డిజిటల్ కార్డు అందిస్తామని వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 3 టిమ్స్ ఆసుపత్రులను ఈ ఏడాది చివరికి ప్రారంభిస్తామని అన్నారు. అంతేకాకుండా నిమ్స్ ఆసుపత్రి విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో సహా మొత్తం 6,582 టెర్షియరీ కేర్ బెడ్లు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటికే 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ స్కూల్స్, 28 పారా మెడికల్ కాలేజీలను ప్రారంభించినట్టు భట్టి తన ప్రసంగంలో వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..