
హైదరాబాద్, 20 మార్చి (హి.స.)తెలంగాణ విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. దీనిపై కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు. మార్పులపై కమిటీ నివేదికే ఫైనల్ కాదన్నారు. జాతీయస్థాయి అధ్యయనం తర్వాత మార్పులు తీసుకురాబోతున్నట్లు చెప్పారు. మీడియాతో చిట్చాట్లో వివిధ అంశాలపై ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్టప్రకారమే ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్రావు అందుబాటులో లేకపోవడంతో దర్యాప్తు 20 నెలలు ఆలస్యమైందన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ దొరికినా.. భాజపా నేతలు మాట్లాడటం లేదని, బీఆర్ఎస్, భాజపా కలిసి ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు.
‘‘ హిల్ట్ పాలసీ, టీడీఆర్ భూబదలాయింపుపై సవాల్ విసిరాను. ఏ ఏజెన్సీతోనైనా విచారణకు సిద్ధమని కేటీఆర్, హరీశ్రావుకు సవాల్ చేశా. హిల్ట్ పాలసీ వల్ల రూ.5 లక్షల కోట్ల అవినీతి జరిగిందనడం సరికాదు. అల్లుడు, కుమారుడు కలిసి కేసీఆర్ను గృహనిర్బంధం చేశారు. అందుకే ఆయన అసెంబ్లీకి రాలేదు. మేం వచ్చాక రూ.3.47 లక్షల కోట్లు అప్పులు చేశాం. రూ.3.30 లక్షల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు చెల్లించాం. మేం తెచ్చిన అప్పుల్లో కేవలం రూ.17వేల కోట్లు మాత్రమే వాడుకున్నాం. జాతీయ జీడీపీ కంటే తెలంగాణ జీఎస్డీపీ మెరుగ్గా ఉంది. జీఎస్టీ వసూళ్లు గడిచిన 2 నెలల్లో రూ.4 వేల కోట్లు దాటాయి’’ అని రేవంత్రెడ్డి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్