
హైదరాబాద్, 20 మార్చి (హి.స.) 'మాకు ఎంత పరిహారమిచ్చినా వద్దు..
మా ఇండ్లు మాకు కావాలి.. ఎక్కడో కూర్చుని సీఎం గాలి మాటలు మాట్లాడొద్దని' బండ్లగూడ జాగిర్ పరిధిలోని మధు పార్కు రెడ్డి అపార్ట్మెంట్ నివాసితులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం నుంచి మధు పార్కు రిడ్జ్ అపార్ట్మెంట్ ముందు, ప్రధాన రహదారి పక్కన శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నివాసితులు మాట్లాడుతూ.. తమకు పరిహారం వద్దే వద్దని స్పష్టం చేశారు. తాము రూపాయి రూపాయి కూడా పెట్టుకుని ఇల్లు కట్టుకున్నామన్నారు. తమ ఇళ్లకు సీఎం రేవంత్ రెడ్డి జీరో వ్యాల్యూ ఎలా చేస్తారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తమ రెక్కలు ముక్కలు చేసుకుని ఇల్లు కట్టుకుంటే ఎలా కూల్చివేస్తారని ప్రశ్నిస్తున్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మిస్తే తమకు ఎలాంటి వ్యతిరేకతలేదని, కానీ తమ ఇళ్ళను కూల్చి వేయొద్దని డిమాండ్ చేశారు. తమ ఇళ్లను కూలగొడతామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని నివాసితులు స్పష్టం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్న తమ ఇళ్లతో పాము ఎంతో అనుబంధం పెంచుకున్నామని, ఇప్పుడు కూలగొడతామంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి తమతో మాట్లాడాలని డిమాండ్ చేశారు.
మధు పార్కు రిడ్జ్ నివాసితుల ఆందోళన కార్యక్రమంలో అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న ప్రముఖ జర్నలిస్టు తులసి చందు పాల్గొని మాట్లాడారు. తాము ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, కానీ నివాసితులను బలవంతంగా ఖాళీ చేయించడం సరికాదని పేర్కొన్నారు. తమ ఇళ్ల విలువను జీరో వ్యాల్యూ చేస్తామనడం సీఎం బ్లాక్ మెయిల్ చేయడమేనని ఆమె మండిపడ్డారు. మధు పార్క్ ఒక మినీ ఇండియా లాంటిదని, ఇక్కడ సుమారు 60 శాతం చిన్నారులు, వృద్ధులు నివసిస్తున్నారన్నారు. వారిని ఒక్కసారిగా వెళ్లిపోవాలని చెప్పడం మానవీయంగా సరైంది కాదని పేర్కొన్నారు. ప్రభుత్వానిది పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని మండిపడ్డారు. అని అన్నారు. మూసి చుట్టూ వాణిజ్య అభివృద్ధి పేరుతో ప్రజలను తొలగించడం తగదన్నారు.
బఫర్ జోన్ అని చెప్పి భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. తాము అన్ని అనుమతులు తీసుకుని అపార్ట్మెంట్ కట్టుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఒక విధంగా మాట్లాడి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం సరైంది కాదన్నారు. ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంతేకాక, గాంధీ విగ్రహం ఏర్పాటును ఆయన మునిమనవడు తుషార్ గాంధీ కూడా వ్యతిరేకించారని కానీ ఆయనను ప్రభుత్వ పెద్దలు సర్ది చెప్పడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు