
హైదరాబాద్, 20 మార్చి (హి.స.)
తెలంగాణ శాసనసభలో 2026-27
ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖకు రూ.13,679 కోట్ల నిధుల కేటాయింపు చేస్తున్నామని భట్టి విక్రమార్క అసెంబ్లీ బడ్జెట్ లో ప్రకటించారు. రాష్ట్రప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)ల ప్రారంభంపై వివరాలు వెల్లడించారు. 2026 చివరి నాటికి సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ 'టిమ్స్'లను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
వీటితోపాటు నిమ్స్ ఆసుపత్రి విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో సహా మొత్తం 6,582 టెర్షియరీ కేర్ బెడ్లు అందుబాటులోకి తెస్తామని అన్నారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటికే 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ స్కూల్స్, 28 పారా మెడికల్ కాలేజీలను ప్రారంభించినట్టు వివరించారు. కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయని, వాటిని కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని భట్టి విక్రమార్క అసెంబ్లీలో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..