
తిరుపతి, 21 మార్చి (హి.స.), :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు, అర్చకులు ఆలయ మహా ద్వారం వద్ద సీఎం చంద్రబాబుకు సిబ్బంది పూర్ణ కుంభం, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆలయ మర్యాదలతో ఆయనను లోపలికి ఆహ్వానించారు.
సీఎం చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టిన రోజున చంద్రబాబు కుటుంబం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, అన్నదానానికి విరాళం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ముఖ్యమంత్రి కుటుంబానికి వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ పర్యటన నేపథ్యంలో తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ