
కరీంనగర్, 21 మార్చి (హి.స.)
8ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో
కీలక నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి (Jeevan Redd) పార్టీ మారుతున్నారనే ప్రచారం ఇప్పిటికే ఊపందుకుంది. అయితే ఆ ప్రచారానికి తాజా పరిణామాలు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. ఇవాళ రంజాన్ (Ramadan) పర్వదినం సందర్భంగా ఆయన బీఆర్ఎస్ (BRS) నేతలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రంజాన్ ప్రార్థనల సందర్భంగా జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, అనుచరులతో కలిసి కనిపించారు. అదేవిధంగా వారితో ఆత్మీయంగా ముచ్చటించడం చర్చనీయాంశమైంది. ఇది కేవలం పండుగ కలయికేనా లేక రాజకీయ మార్పుకు సంకేతమా.. అని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరగుతోంది.
కాగా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని, దశాబ్దాల కాలంగా పార్టీని నమ్ముకున్న తన కంటే వలస వచ్చిన నేతలకే ఎక్కువ విలువ ఇస్తున్నారని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జీవన్ రెడ్డి, తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నివాసం వద్ద కాంగ్రెస్ (Congress) పార్టీ ఫ్లెక్సీలను తొలగించడం ఆయన పార్టీ వీడటం ఖాయమనే సంకేతాలను ఇస్తోంది. తన రాజకీయ భవిష్యత్తుపై అనుచరులతో ఇప్పటికే చర్చలు జరిపిన జీవన్ రెడ్డి, ఉగాది పండుగ తర్వాత తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తానని వెల్లడించారు. ఒకవేళ ఆయన బీఆర్ఎస్లో చేరితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకుల అంచనా.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు