
హైదరాబాద్, 21 మార్చి (హి.స.)ముందుచూపుతోనే సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి ప్రణాళికలు వేశామని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. వసతులన్నీ సమకూర్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమైతే.. కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేసిందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయుష్ ఆస్పత్రులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందన్నారు.
‘‘ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే జిల్లా జైలుకు భూసేకరణ చేశాం. జైలు నిర్మాణం పూర్తయి రెండేళ్లయింది. ఇప్పుడు వచ్చి మీరు ప్రారంభిస్తున్నారు. శ్రమ ఎవరిది.. శిలాఫలకం ఎవరిది? ఇప్పటికీ రుణమాఫీ పూర్తి కాలేదు. నర్మెట్టలోనే 350 మంది రైతులకు రుణమాఫీ అవ్వలేదు. మూడు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టారు. రైతుబంధు బకాయిలు వెంటనే ఇవ్వాలని రైతుల తరఫున అడుగుతున్నా. పంటల బీమా ఇప్పటికీ చేయించలేదు. వర్షాలు, తుపానుల వల్ల నష్టపోయిన పంటలకు బీమా రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సిద్దిపేటకు ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు’’ అని హరీశ్రావు ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్