ఆరు గ్యారంటీల్లో అరగ్యారంటీ అయినా అమలైందా?: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం 4 కోట్ల మందికి టోపీ పెట్టిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు
KTR


హైదరాబాద్, 21 మార్చి (హి.స.)కాంగ్రెస్ ప్రభుత్వం 4 కోట్ల మందికి టోపీ పెట్టిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం రోజున 6 గ్యారంటీల దస్త్రంపై సంతకం చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభయహస్తం దస్త్రంపై సీఎం తొలి సంతకం చేశారన్నారు. గవర్నర్ ప్రసంగంలోనూ ఆరు గ్యారంటీలపై సంతకం జరిగిందని చెప్పించారన్నారు.

‘‘ ఆరు గ్యారంటీల్లో అర గ్యారంటీ కూడా ఇప్పటివరకు అమలు కాలేదు. సీఎం సంతకం చేసిన దస్త్రం కనిపించకుండా పోయింది. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోరుతూ ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్నాం. వచ్చే శుక్రవారం నాడు శాసనసభలో మేం ప్రైవేటు బిల్లు పెట్టాలని నిర్ణయించాం. అందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ను కోరుతున్నాం. కాంగ్రెస్ హామీ ఇచ్చిన అంశమే కాబట్టి ఆ పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వాలి.

మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు.. వెంటనే అమలు చేయాలి. పింఛను రూ.2వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామన్నారు.. వెంటనే పెంచాలి. విద్యార్థులకు విద్యాభరోసా కార్డులు ఇస్తామన్నారు.. వెంటనే ఇవ్వాలి. కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామన్నారు.. అదీ అమలు చేయాలి. మేం పెట్టే బిల్లు పాస్ అయితే, హామీలన్నీ చట్టప్రకారంగా అమలవుతాయి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande