బిఆర్ఎస్ పార్టీలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరు పై ముఖ్య నేతల తిరుగుబాటు
కరీంనగర్, 21 మార్చి (హి.స.) హుజూరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒంటెద్దు పోకడలు, ఆయన వ్యవహారశైలిపై స్థానిక నాయకత్వం తిరుగుబావుటా ఎగురవేసింది. శుక్రవారం రాత్రి జమ్మికుంట మున్సిపల్ పర
BRS MLA


కరీంనగర్, 21 మార్చి (హి.స.)

హుజూరాబాద్ నియోజకవర్గ

బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒంటెద్దు పోకడలు, ఆయన వ్యవహారశైలిపై స్థానిక నాయకత్వం తిరుగుబావుటా ఎగురవేసింది. శుక్రవారం రాత్రి జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారంలోని ఓ వెంచర్లో నియోజకవర్గ స్థాయికి చెందిన సుమారు వందమంది ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు అత్యవసరంగా 'రహస్య సమావేశం' నిర్వహించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే తీరు వల్ల నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్ నాయకులను ఎమ్మెల్యే కనీసం గౌరవించడం లేదని మండిపడ్డారు. వీణవంక జాతర వంటి తన వ్యక్తిగత వివాదాలను పార్టీపైకి రుద్దుతున్నారని, దీనివల్ల కార్యకర్తలు అనవసరంగా పోలీసు కేసుల పాలవుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సొంత పార్టీ అభ్యర్థుల ఓటమికి ఎమ్మెల్యే పరోక్షంగా కారణమయ్యారని కొందరు కౌన్సిలర్లు నేరుగానే ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పార్టీని నమ్ముకున్న వారిని గాలికి వదిలేసి, తన సొంత అజెండా కోసం అందరినీ వాడుకుంటున్నారని నేతలు వాపోయారు. కన్నూరు సమావేశంలో పాల్గొని అసమ్మతి గళం వినిపించిన ప్రముఖులలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్లు తక్కల్లపల్లి రాజేశ్వరరావు, పోడేటి రామస్వామి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ఎడవెల్లి కొండారెడ్డి, జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్, పింగిలి రమేష్, సత్యనారాయణ రావు, చుక్క రంజిత్, విజయభాస్కర్ రెడ్డి, పింగళి ప్రదీప్ రెడ్డి, బాలసాని కుమారస్వామి, బచ్చు శివకుమార్, వెంకట్ రెడ్డి, తోట లక్ష్మణ్, కృష్ణారెడ్డి సహా పలువురు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు ఉన్నారు.

నేతలు కౌశిక్ రెడ్డి వెంట ఉంటే తమపై పోలీసు కేసులు తప్ప పార్టీకి గానీ, నియోజకవర్గానికి గానీ వచ్చే ప్రయోజనం ఏమీ లేదని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అందరం కలిసికట్టుగా ఉండి పార్టీని, తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకుంటామని తీర్మానించారు. తమ తదుపరి ప్రణాళికను త్వరలోనే బహిరంగంగా ప్రకటిస్తామని స్పష్టం చేయడంతో హుజూరాబాద్ గులాబీ పార్టీలో ఏం జరగబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande