జీవన్ రెడ్డి పార్టీ మార్పు వార్తలు.. హుటాహుటిన జగిత్యాలకు మంత్రులు
జగిత్యాల, 21 మార్చి (హి.స.) మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) పార్టీ మారుతున్నారనే ప్రచారంతో అప్రమత్తమైన అధిష్టానం బుజ్జగింపు చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Nat
Jeevan Reddy


జగిత్యాల, 21 మార్చి (హి.స.)

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) పార్టీ మారుతున్నారనే ప్రచారంతో అప్రమత్తమైన అధిష్టానం బుజ్జగింపు చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) ఆదేశాల మేరకు ఇద్దరు మంత్రులు ఇవాళ జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నేరుగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జీవన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు వారు గంటకు పైగా చర్చలు జరిపారు.

దశాబ్దాలుగా పార్టీకి అండగా ఉన్న మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడకూడదని మంత్రులు జీవన్ రెడ్డికి సూచించారు. సీనియర్ నేతగా మీ సేవలు పార్టీకి ఎంతో అవసరమని వారు స్పష్టం చేశారు. స్థానికంగా ఉన్న రాజకీయ ఇబ్బందులు, ఇతర అసంతృప్తులపై మంత్రులు ఆయనతో చర్చించారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని గట్టి హామీ ఇచ్చారు.

జీవన్ రెడ్డితో చర్చించిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు విలేకరులతో మాట్లాడారు. పార్టీకి సంబంధించిన ఏ విధమైన నిర్ణయం తీసుకోకండి అని జీవన్ రెడ్డిని కోరాం. జీవన్ రెడ్డికి పార్టీ అండగా నిలబడే ఆలోచన చేస్తుందని జీవన్ రెడ్డితో చర్చించిన అంశాలను పార్టీ, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం అన్నారు. ఈ ప్రాంతానికి జీవన్ రెడ్డి ఒక పెద్దదిక్కు, అభివృద్ధి కోసమే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాం. జీవన్ రెడ్డి గురించి తెలంగాణ రాష్ట్రంలో తెలియని వారు ఎవరు ఉండరు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుకగా ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి అని చెప్పక తప్పదు చెప్పుకొచ్చారు. జీవన్ రెడ్డి బాధపడితే మేము బాధపడ్డట్టే. కాంగ్రెస్ నాయకులు మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు జీవన్ రెడ్డితో గతంలో మాట్లాడారని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదురుకుంటున్న సమస్యలను జీవన్ రెడ్డి మా దృష్టికి తీసుకవచ్చారని ఆయన తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande