
పెద్దపల్లి, 21 మార్చి (హి.స.)
రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం మానవాళికి ఉన్నతమైన విలువలను నేర్పించే పవిత్ర కాలమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని శనివారం పెద్దపల్లి జిల్లా మందమర్రిలోని విద్యానగర్, సీఈఆర్ క్లబ్ సమీపంలోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులతో కలసి ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. గంగా జమునా తేహజీబ్ లాగా చెన్నూరు నియోజక వర్గంలోని ప్రజలు హిందూ, ముస్లిం సఖ్యతకు ప్రతీక అన్నారు. ప్రేమ, అనురాగాలు, మానవత్వంతో ప్రజలందరూ ఉన్నప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుంది. మందమర్రిలో రూ.50 లక్షలతో షాదిఖానా, ఈద్గా వద్ద కాంపౌండ్ వాల్, ఇతర అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. త్వరలోనే సింగరేణి సంస్థతో మాట్లాడి, ఈద్గా వద్ద కమాన్ కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వివేక్ పేర్కొన్నారు.
---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..