
హైదరాబాద్, 21 మార్చి (హి.స.) మొయినాబాద్ డ్రగ్స్ కేసు రోజుకో
మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కేసు మూలాలను, అంతర్జాతీయ సంబంధాలను ఛేదించేందుకు ఇటీవలే రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో (Special Investigation Team)ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Rohit Reddy) ఫామ్ హౌస్లో జరిగిన పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్ (Abhishek Singh)ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న అభిషేక్ సింగ్, రోహిత్ రెడ్డి నిర్వహించే పార్టీలకు ప్రధానంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా సిట్ గుర్తించింది.
ఇక రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్, అభిషేక్ సింగ్ నుంచి నేరుగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా ఆధారాలు కూడా లభించినట్లుగా సమాచారం. రోహిత్ రెడ్డి సూచనల మేరకే శరత్ ఈ డ్రగ్స్్స్ను సేకరించినట్లుగా తెలుస్తోంది. గతంలో రోహిత్ రెడ్డికి సుమారు 24 సార్లు అభిషేక్ సింగ్ డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా సమాచారం. అభిషేక్ సింగ్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న అధికారులు, అందులోని కాల్ డేటా, మెసేజ్లను విశ్లేషిస్తున్నారు. అనంతరం ఈ డ్రగ్స్ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు..? ఎక్కడి నుండి డ్రగ్స్ వస్తున్నాయి..? అనే విషయాలను బయటకు తీసే పనిలో ఉన్నారు. మరోవైపు, రోహిత్ రెడ్డి కస్టడీ పిటిషన్పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు