
హైదరాబాద్, 21 మార్చి (హి.స.)
పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా జరుపుకునే ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగ వేడుకలు భాగ్యనగరంలో అంబరాన్నంటాయి. చారిత్రాత్మక మక్కా మసీదు ముస్లిం సోదరుల సామూహిక ప్రార్థనలతో సందడిగా మారింది. నెల రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు, నేడు పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మక్కా మసీదులో వేలాది మంది ముస్లిం సోదరులు సామూహిక నమాజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా లోక కల్యాణం కోసం, శాంతి సౌభాగ్యాల కోసం ప్రత్యేక దువా చేశారు. నమాజ్ అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ 'ఈద్ ముబారక్' అని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
నమాజ్ కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చార్మినార్, మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. పాతబస్తీ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ముందస్తుగా ఆంక్షలు విధించారు.
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 'క్రమశిక్షణ, దైవచింతన, దానగుణానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలి. ఈ పవిత్ర దినాన అందరూ ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను' అని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. నగరంలోని పలు మసీదులు, ఈద్గాల వద్ద కూడా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
పవిత్ర రంజాన్ (Ramadan)
పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల(Governor Shiv Pratap Shukla) రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఖురాన్ బోధనల విశిష్టతను కొనియాడారు. పవిత్ర ఖురాన్ బోధనల పట్ల తనకు ఎంతో గౌరవం, భక్తి ఉన్నాయని పేర్కొన్నారు. ఖురాన్ మనిషిని సన్మార్గంలో నడిపిస్తుందని, మానవత్వం, కరుణకు అది ఒక గొప్ప మార్గదర్శి అని ఆయన కొనియాడారు. రంజాన్ పండుగ సమాజంలో శాంతి, సోదరభావాన్ని మరింత పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ప్రార్థనలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు