
హైదరాబాద్, 21 మార్చి (హి.స.)
ఒకే వాహనదారుడికి ఉన్న రెండో వాహనానికి విధిస్తున్న ట్యాక్స్ ఇకపై ఉండదు. సెకండ్ వెహికిల్స్ కు వర్తించే అదనపు రెండు శాతం జీవితకాలపు పన్నును ప్రభుత్వం రద్దుచేసింది. ఇది ఈనెల 23 నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రంలో ఈ నెల 23న వాహన్ పోర్టల్ ను ప్రవేశపెడుతున్నందున అదేరోజు నుంచి సెకండ్ వెహికిల్ పై అదనపు ట్యాక్స్ రద్దవుతుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. జాతీయ పోర్టల్ వాహన్ తో అనుసంధానంతోనే వాహనదారులకు ఈ ప్రయోజనం కలుగుతుంది. సాధారణంగా ఒక వ్యక్తికి ఓ వాహనం ఉన్న తర్వాత.. మరో వాహనం కొనుగోలు చేస్తే రెండు శాతం అదనపు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అదనపు ట్సాక్స్ చెల్లించే వారి సంఖ్య ప్రతి ఏడాది ఎక్కువగానే ఉంటున్నది. వాహన్ తో అనుసంధానమైతే ఈ ట్యాక్స్ జనరేట్ కాదు. రెండో వాహనంతో పాటు ఆ తర్వాత అదనంగా మరిన్ని వాహనాలు కొనుగోలు చేసినా అదనపు పన్ను ఉండదు. కానీ ప్రతి వాహనంపైనా లైఫ్ ట్యాక్స్ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.
రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు పారదర్శక, వేగవంతమైన, సులభమైన సేవలను అందించేందుకు 'వాహన్ పోర్టల్'ను ఈ నెల 23 నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ పోర్టల్ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఈ వాహన్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్త వాహనాల సమాచారం ఒకే చోట లభ్యమవుతుంది. వాహన్ తో అనుసంధానం ద్వారా తెలంగాణకు చెందిన వాహనాలు జాతీయ డేటాబేస్ లోకి వెళ్లనున్నాయి. ప్రస్తుత విధానంతో వాహన యజమాని చిరునామా, పేరు మార్పు, వాహన ఆర్సీ డూప్లికేట్ కాపీ వంటి సేవలు ఆన్ లైన్ లో అందుబాటులో లేవు. ఈ సేవల కోసం ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లాల్సి ఉండేది. కానీ వాహన్ పోర్టల్ అనుసంధానం ద్వారా... ఈ తరహా సేవలన్నీ ఇక ఆన్లైన్లోకి వస్తాయి. ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చుని ఆన్ లైన్ లో వాహనాల పనులను పూర్తి చేసుకునే వీలు ఉంటుంది. ఫలితంగా దళారుల ప్రమేయం లేకుండానే పనులన్నీ పూర్తిచేసుకోవచ్చు. అంతేకాకుండా పోలీసులకు వాహనాల వివరాలు తక్షణమే లభించడంతో నేర నియంత్రణకు కూడా ఇది తోడ్పడనుంది. రవాణా శాఖ అధికారులకు కూడా డేటా నిర్వహణ సులభమవుతుంది. వాహన సేవల కోసం 'వాహన్ పోర్టల్'ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రవాణా రంగాన్ని పూర్తిగా డిజిటల్ వైపు మళ్లించే దిశగా ముందడుగు వేసినట్టయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..