తిరుమల వీధుల్లో నడుస్తూ.. భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు..
తిరుమల, 21 మార్చి (హి.స.) సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కుమారుడైన దేవాన్ష్ జన్మదిన వేడుకలు శనివారం తిరుమలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద
చంద్రబాబు..


తిరుమల, 21 మార్చి (హి.స.)

సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కుమారుడైన దేవాన్ష్ జన్మదిన వేడుకలు శనివారం తిరుమలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు తిరుమల వీధుల్లో నడుస్తూ సామాన్య భక్తులతో ముచ్చటించారు. శ్రీవారి దర్శనం త్వరితగతిన పూర్తయ్యేలా చూసేందుకు త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నట్టు భక్తులకు హామీ ఇచ్చారు.

ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అర్ధాంగి భువనేశ్వరి, మంత్రి లోకేశ్, దేవాన్ష్ కలిసి వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.

దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని, శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ఒకరోజు వితరణ ఖర్చు కింద రూ.44 లక్షల భారీ విరాళాన్ని నారా కుటుంబం అందజేసింది. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, దేవాన్ష్ స్వయంగా భక్తులకు అల్పాహారం వడ్డించి, వారితో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.

ఈ కార్యక్రమాల తర్వాత సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ దిగి తిరుమల మాడ వీధుల్లో కొద్దిసేపు కాలినడకన పర్యటించారు. ఈ సమయంలో భక్తులను ఆపి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. లడ్డూ ప్రసాదం నాణ్యత ఎలా ఉందని ప్రశ్నించగా, చాలా బాగుందని భక్తులు బదులిచ్చారు. దర్శనం మరింత వేగంగా జరిగేలా చూడాలని పలువురు భక్తులు కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు. భక్తుల సౌకర్యం కోసమే టీటీడీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని, దర్శన ప్రక్రియను వేగవంతం చేయడానికి ఏఐ టెక్నాలజీని తీసుకువస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర, పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande