
ఢిల్లీ, 27 మార్చి (హి.స.)
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ముడిచమురు లభ్యతపై ఆందోళన నెలకొన్న వేళ.. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందని, ఫలితంగా రేట్లు పెరుగుతాయన్న ఊహాగానాలు వేగంగా ఊపందుకున్నాయి. గడిచిన మూడురోజుల్లో ఎటుచూసిన పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. దేశంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, మరో రెండునెలలు ఢోకా లేదని కేంద్రం పలుమార్లు చెప్పడంతో.. వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా.. వాహనదారులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గించింది. పెట్రోల్ పై రూ.13 ఉన్న ఎక్సైజ్ డ్యూటీని రూ.3కు తగ్గించినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటించింది. అలాగే డీజిల్ పై ఉన్న రూ.10 ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేసింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి.
ఇరాన్పై యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో కీలకమైన 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) దిగ్బంధానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్త చమురు సరఫరాలో ఐదవ వంతు ఈ మార్గం గుండానే సాగుతుంది. భారత్ తన చమురు దిగుమతుల్లో సుమారు 40 నుంచి 50 శాతం ఈ మార్గం నుండే పొందుతోంది. దీనివల్ల దేశంలో పెట్రో ధరలు ఆకాశాన్నంటకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. యుద్ధం కారణంగా గ్యాస్ మరియు చమురు కొరత ఏర్పడుతుందనే వార్తలను ప్రభుత్వం కొట్టిపారేసింది. ప్రస్తుతం దేశంలో 60 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని మరోమారు తెలిపింది. .
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV