నేడు క్రీడాభిమానుల ఐపీఎల్ పండుగ ప్రారంభం.. పాల్గొంటున్న 10 జట్లు 74 మ్యాచులు
హైదరాబాద్, 28 మార్చి (హి.స.) ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ మళ్లీ రానే వచ్చింది. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా ఫ్యాన్స్ను ఉర్రూతలూగించేందుకు సిద్ధమైంది. శనివారం బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబా
IPL


హైదరాబాద్, 28 మార్చి (హి.స.)

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ మళ్లీ రానే వచ్చింది. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా ఫ్యాన్స్ను ఉర్రూతలూగించేందుకు సిద్ధమైంది. శనివారం బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య ఐపీఎల్ సంబురం ఓపెనింగ్ మ్యాచ్ తో మొదలుకానుంది. దాదాపు రెండు నెలలపాటు లీగ్ అభిమానులను అలరించనుంది. నేటి నుంచి మే 24 వరకు లీగ్ దశలో 70 మ్యాచ్లు జరగనున్నాయి. మే 31న ఫైనల్ జరగనుంది. ప్లే ఆఫ్ కు సంబంధించిన తేదీలు, వేదికలు ఖరారవ్వాల్సి ఉంది. గతేడాది టైటిల్ నిరీక్షణకు తెరదించిన డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సారి కూడా టైటిల్ నిలబెట్టుకోవాలన్న ఆశతో ఉంది. ఇక, చెన్నయ్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ 'సిక్సర్' కొట్టాలని భావిస్తున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ 4వ టైటిల్ పై కన్నేయగా.. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ రెండో కప్పు కోసం ఎదురుచూస్తున్నాయి. ఇక పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తొలి టైటిల్ నిరీక్షణకు తెరదించాలని బరిలోకి దిగుతున్నాయి. మరి, ఈ సీజన్ చాంపియన్ ఎవరో మే 31న తేలనుంది.

2022 నుంచి అమలు చేస్తున్న ఫార్మాటే ఈ సీజన్లోనూ కొనసాగనుంది. మొత్తం 74 మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ దశలో 70 మ్యాచ్లు ఉంటాయి. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఏలో సీఎస్కే, కేకేఆర్, ఆర్ఆర్, ఆర్సీబీ, పీబీకేఎస్.. గ్రూపు-బిలో ఎంఐ, ఎస్ఆర్హెచ్, జీటీ, డీసీ, ఎల్ఎసీ జట్లు ఉన్నాయి. లీగ్ స్టేజ్లో ఒక్కో టీమ్ 14 మ్యాచ్లు ఆడతుంది. ఒక జట్టు తమ గ్రూపులోని మరో 4 జట్లతో, అలాగే మరో గ్రూపులో తమ స్థానంలో ఉన్న జట్టుతో రెండేసి గేములు, ఇతర మూడు జట్లతో చెరో గేము ఆడుతుంది.

లీగ్ స్టేజ్లో టాప్-4 జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. తొలి, రెండు స్థానాల్లో నిలిచిన టీమ్లు క్వాలిఫయర్-1 ఆడతాయి. అక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు వెళ్తుంది. 3,4 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్లో పాల్గొంటాయి. అక్కడ నెగ్గిన జట్టు, క్వాలిఫయర్-1లో ఓడిన టీమ్ రెండో ఫైనల్ బెర్త్ కోసం పోటీపడతాయి. ఇక ఫైనల్లో క్వాలిఫయర్ 1 విజేత, క్వాలిఫయర్ 2 విన్నర్ టైటిల్ కోసం తాడోపేడో తేల్చుకుంటాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande