
జేవార్ (ఉత్తరప్రదేశ్ )28 మార్చి (హి.స.)ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (జేవార్) శనివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ఎయిర్పోర్ట్.. దేశ విమానయాన రంగంలో సరికొత్త రికార్డులకు వేదిక కానుంది.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఏర్పడుతున్న విపరీతమైన రద్దీని తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. దాదాపు రూ.11,200 కోట్ల వ్యయంతో, 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో (ఎఫ్డీఐ)జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ దీనిని నిర్మించింది.
నోయిడా, మీరట్, ఘజియాబాద్, మథుర, ఆగ్రా తదితరప్రధాన నగరాలకు ఇది ప్రధాన కేంద్రంగా మారనుంది. పర్యాటకంతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాలకు ఇది ముఖద్వారంగా నిలవనుంది.
కట్టుదిట్టమైన భద్రత.. ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాని పర్యటన నేపథ్యంలో జేవార్లో ఐదు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 5,000 మంది పోలీసులు, ఎస్పీజీ, ఏటీఎస్, సీఐఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాంతాన్ని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించారు. మరోవైపు, ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు యమునా ఎక్స్ప్రెస్వే, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వే మీదుగా వెళ్లే భారీ వాహనాలను మళ్లించారు. అయితే, అంబులెన్స్లు, ఇతర అత్యవసర వాహనాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ