
హిందూపురం, 30 మార్చి (హి.స.)ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాలు చేపడుతున్న యుద్ధం సామాన్యులపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గ్యాస్ కష్టాలు అధికమయ్యాయి. హిందూపురం పట్టణంలో కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో లేక వాటిపై ఆధారపడిన చిన్నచిన్న హోటళ్లు మూతపడుతున్నాయి. దీని వలన పరోక్షంగా వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. బ్లాక్లో వాణిజ్య సిలిండర్ రూ.4 వేల దాకా కొంటున్నామంటూ కొన్ని హోటళ్లు యజమానులు అల్పహారం, భోజనం ధరలను ఇష్టానుసారంగా పెంచేశారు. దీంతో పట్టణంలో రోజువారి కూలీలు హోటళ్లలో భోజనం తినాలంటే జంకే పరిస్థితి నెలకొంది.
తగినంత గ్యాస్ సరఫరా లేకపోవడంతో పట్టణంలో పలు హోటళ్లను మూసేశారు. గత వారం రోజుల్లో హిందూపురంలో పదుల సంఖ్యలో తోపుడుబండ్లు, చిన్నాచితకా హోటళ్లతోపాటు కొన్ని పెద్ద హోటళ్లు సైతం మూతపడ్డాయి. దీని వలన మిగిలిన హోటళ్ల వారు ధరలను పెంచేశారు. కొన్ని హోటళ్లలో ప్లేటు ఉప్మా రూ30, మరికొన్ని చోట్ల రూ.40 ఉండేది. కానీ ప్రస్తుతం రూ.40 నుంచి రూ.60కి పెంచారు. ఇడ్లీలు కొన్ని చోట్ల ఒక ఇడ్లీ రూ. 10లు ఉండేది. మరికొన్నిచోట్ల రూ.25లకు రెండు ఇడ్లీ ఇచ్చేవారు. ప్రస్తుతం సింగిల్ ఇడ్లీ రూ.20, రెండు ఇడ్లీలు రూ. 40కి పెంచారు. మసాలా దోశ మొన్నటి వరకు రూ. 30లు ఉండేది. ప్రస్తుతం రూ. 50కి పెంచారు. అదేవిధంగా భోజనం హోటళ్లలో ఇదివరకు పుల్ భోజనం రూ. 100 ఉండేది. ప్రస్తుతం రూ.130 నుంచి రూ. 140కి పెంచారు. ఇక రాగి ముద్దతో పాటు హాఫ్ ప్లేటు భోజనం రూ50కు ఇచ్చేవారు. ఇప్పుడు దానిని రూ. 70లకు పెంచారు. ఇదేమని హోటళ్ల యజమానులను ప్రశ్నిస్తే వాణిజ్య సిలిండర్లు దొరకడం లేదని, తక్కువ ధరకు ఇస్తే మేము కూడా హోటళ్లను మూసుకోవాల్సి వస్తుందని సమాధానం చెబుతున్నారు.
ఇదిలా ఉంటే అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ పంపిణీ చేయకపోవడంతో రెండు రోజులుగా పలువురు అంగన్వాడీ కార్యకర్తలు ఇళ్ల నుంచి భోజనం చేసుకొచ్చి చిన్నారులకు వడ్డిస్తున్నట్లు తెలిసింది. సిలిండర్లు అయిపోయాయని సూపర్వైజర్లను, టీడీపీ నాయకులను అడుగుతున్నా స్పందించలేదని, చేసేది లేక ఇళ్ల నుంచి తెస్తున్నామని, ఇలాగే అయితే కష్టంగా ఉంటుందని వారు వాపోతున్నారు.
హోటళ్ల నిర్వాహకులు ఒక్క గ్యాస్ ధర పెరిగిందని, సగానికి సగం ధరలు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోధ్యం చూస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై తహసీల్దార్ వెంకటేశులును వివరణ కోరగా వాణిజ్య సిలిండర్ల సమస్య ఒకటి రెండు రోజుల్లో తీరనుందన్నారు. 20 శాతం వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచాలని కేంద్రం ఆదేశాలిచ్చిందని, గ్యాస్ కొరతను ఆసరా చేసుకొని హోటళ్లలో ధరలు పెంచితే చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్