
హైదరాబాద్, 31 మార్చి (హి.స.)
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కరీంనగర్ పోలీస్ కమిషనర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనకు సీఐడీ (CID) అధికారులు నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్లోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జనవరి 29వ తేదీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సమ్మక్క-సారక్క జాతర వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమయంలో జరిగిన గొడవ నేపథ్యంలో, కరీంనగర్ పోలీస్ కమిషనర్ను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉన్నతాధికారి పట్ల అగౌరవంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
మొదట స్థానిక పోలీసులు దర్యాప్తు చేసిన ఈ కేసును, ప్రభుత్వం తదుపరి విచారణ నిమిత్తం సీఐడీకి అప్పగించింది. ఈ క్రమంలోనే సీఐడీ అధికారులు ప్రాథమిక ఆధారాలను సేకరించి, ఎమ్మెల్యేకు నోటీసులు పంపారు. ఏప్రిల్ 4న జరిగే విచారణలో కౌశిక్ రెడ్డి వివరణ తీసుకోనున్నారు. గత కొంతకాలంగా అధికార పక్షంపై నిప్పులు చెరుగుతున్న కౌశిక్ రెడ్డికి ఈ నోటీసులు రావడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఇది కక్షపూరిత చర్య అని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తుండగా, చట్టం తన పని చేసుకుపోతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..