టిడ్కో ఇళ్లు.. పార్టీలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక: విజయవాడ ఎమ్మెల్యేలు
విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో టిడ్కో ఇళ్ల ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోండా ఉమ, గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
Tdp


ఎన్టీఆర్ జిల్లా, 30 మార్చి (హి.స.)టిడ్కో ఇళ్లలో ఉన్న 10 శాతం వసతులు కూడా సెంట్లో కట్టిన ఇళ్లలో లేవని ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. సోమవారం విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో టిడ్కో ఇళ్ల ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోండా ఉమ, గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ.. ఈ ఇళ్ల నిర్మాణం కోసం గత 5 ఏళ్లలో ఎన్నో బాధలు, కష్టాలు పడ్డారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఇళ్లను ఇచ్చామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లు రద్దు చేసుకోమని బలవంతం చేశారని.. కానీ చాలా మంది ప్రజలు వారి అబద్ధపు మాటలు నమ్మకుండా నిలబడ్డారని ఎమ్మెల్యే బొండా ఉమ తెలిపారు.

పార్టీలకు అతీతంగా టిడ్కో ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 2019 - 24 మధ్య జగన్ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని విమర్శించారు. జగన్ వైరస్ వల్ల అన్ని వ్యవస్థలు కుంగిపోయాయని వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను గాడిలో పెట్టడానికి ఇంత కాలం పట్టిందని ఎమ్మెల్యే తెలిపారు.

సొంత ఇంటిని సాకారం చేస్తున్న ప్రభుత్వానికి కలెక్టర్ లక్ష్మీశా కృతజ్ఞతలు తెలియజేశారు. రోడ్లు, డ్రైనేజ్, నీటి సదుపాయం సహా అన్ని వసతులు కల్పించామని చెప్పారు. టిడ్కో ఇళ్లలో విడతల వారీగా ప్రజలు గృహ ప్రవేశాలు చేస్తున్నారని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande