
అమరావతి, 31 మార్చి (హి.స.)
కడప, ఒంటిమిట్టలోని ప్రసిద్ధ కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు( ఘనంగా జరుగుతున్నాయి. మార్చి 26న అంకురార్పణతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఏప్రిల్ 5 వరకు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు(మంగళవారం) ఉదయం మోహిని అలంకారంలో కోదండరాముడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇవాళ రాత్రి గరుడ వాహనంపై ఒంటిమిట్ట పురవీధుల్లో స్వామి వారి ఊరేగింపు నిర్వహించనున్నారు.
రేపు(ఏప్రిల్ 1) రాత్రి అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం జరగనుంది. ఈ మహోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు( దంపతులు హాజరవుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎం దంపతులు సమర్పించనున్నారు. కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం, పురవీధులు రంగురంగుల దీపాలు, ప్రకాశవంతమైన ప్రదర్శన బోర్డులతో అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు, పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ