డ్రైవర్ సుబ్రమణ్యం. హత్య.కేసులో నిందితురాలు . లక్ష్మీ. దుర్గా నాన్ బెయిలబుల్.వారెంట్ వెనక్కి
రాజమహేంద్రవరం, 31 మార్చి (హి.స.) , :డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ నేత అనంత బాబు భార్య లక్ష్మీ దుర్గకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం (అప్పటి విచారణ కోర్టు) జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ)ను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్ల
డ్రైవర్ సుబ్రమణ్యం. హత్య.కేసులో నిందితురాలు . లక్ష్మీ. దుర్గా నాన్ బెయిలబుల్.వారెంట్ వెనక్కి


రాజమహేంద్రవరం, 31 మార్చి (హి.స.) , :డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ నేత అనంత బాబు భార్య లక్ష్మీ దుర్గకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం (అప్పటి విచారణ కోర్టు) జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ)ను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానం(ప్రస్తుత విచారణ కోర్టు) వెనక్కి తీసుకొంది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. పాస్పోర్టును కోర్టుకు సమర్పించాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని చెప్పింది. మృతుడి తల్లిదండ్రుల (ఫిర్యాదుదారులు)కు రక్షణ కల్పించాలని, 15 రోజులకు ఒకసారి దానిపై కోర్టుకు నివేదిక సమర్పించాలని ఎస్పీని ఆదేశించింది. గతంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఆమెపై ఎన్బీడబ్ల్యూ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఎన్బీడబ్ల్యూపై జరిగింది. ఈ విచారణకు లక్ష్మీదుర్గ హాజరయ్యారు.

ఎన్బీడబ్ల్యూపైౖ ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. కేసు దర్యాప్తులో ఆమె ఏ దశలోనూ సహకరించలేదని, సిట్ నోటీసును ఆమె చెల్లికి అందజేయాల్సి వచ్చిందని ప్రాసిక్యూషన్ తరఫున పీపీ రాచపల్లి ప్రసాద్, న్యాయవాది ముప్పాళ్ల విశాల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుండకపోయినా దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తోందని నిందితురాలి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ఎన్.మూర్తి, సీనియర్ న్యాయవాది రఘు కోర్టుకు చెప్పారు. మృతుడు వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కూడా కోర్టు విచారణకు హాజరయ్యారు. తమకు ప్రాణ భయం ఉందని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన జడ్జి గంధం సునీత నిర్ణయాన్ని ప్రకటించారు.

నిందితురాలిపై ఉన్న నాన్బెయిలబుల్ వారెంట్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. కాగా, కోర్టు విచారణ తర్వాత సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఎన్బీడబ్ల్యూను వెనక్కి తీసుకోవడం మంచిది కాదని చెప్పారు. ఇలాంటి కేసులో ఎన్బీడబ్ల్యూను రీకాల్ చేస్తే సమాజం వేరే విధంగా చూసే ప్రమాదం ఉందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande