
అమరావతి, 31 మార్చి (హి.స.)తుంగభద్ర డ్యామ్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న గేట్లను మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఈరోజు(మంగళవారం) పరిశీలించారు. తుంగభద్ర డ్యామ్ సైట్ నుంచి సీఎం చంద్రబాబుకు మంత్రి ఫోన్ చేశారు. డ్యాం సైట్ నుంచే కొత్త గేట్లు అమర్చేందుకు జరుగుతున్న పనులను సీఎంకు ఆర్థిక మంత్రి వివరించారు. గేట్ల బిగింపు ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా ఎన్ని రోజుల సమయం పడుతుందని మంత్రి పయ్యావులను సీఎం అడిగారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి తుంగభద్ర గేట్ల బిగింపు పనులు పూర్తి కానున్నట్టు మంత్రి చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో కర్ణాటక ప్రభుత్వం కూడా త్వరితగతిన పనులు చేపట్టిందని సీఎంకు పయ్యావుల కేశవ్ వివరించారు. గేట్ల బిగింపు పనులు పూర్తైతే కర్నూలు, అనంతపురం జిల్లాకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. సీమ జిల్లాలకు మేలు కలిగేలా తుంగభద్ర గేట్ల బిగింపునకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించినందుకు సీఎంకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ధన్యవాదాలు తెలిపారు.
తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోతే కళ్లలో నీళ్లు వచ్చాయని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. డ్యామ్ వద్ద నుంచి మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తే.. రైతుల ప్రయోజనాలు కాపాడాలని ఆదేశించారని తెలిపారు. గేట్లు మొత్తం తుప్పుపట్టాయని.. చేత్తో ముట్టుకుంటే విరిగిపోతున్నాయని అన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడటం కోసం కొత్త గేట్లను అమర్చేందుకు గో ఆల్ అవుట్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళ్లాలని సూచించారన్నారు.
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్