
అమరావతి, (హి.స.)రాష్ట్రంలో రెండు కీలక నగరాలైన విజయవాడ-విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైల్ నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మించే ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తోంది. దీనికోసం ఫైనల్ లొకేషన్ సర్వే చేయాలని భావిస్తోంది. అలాగే విజయవాడ-కర్నూలు మధ్య నేరుగా రైళ్లు నడపటమే కాకుండా, తక్కువ ప్రయాణ సమయం ఉండేలా చూసేందుకు సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ కూడా నిర్మించాలనుకుంటోంది. వీటితోపాటు మరో ఆరు మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు నిర్మించడంపై దృష్టిపెట్టింది. వీటన్నింటికీ ఫైనల్ లొకేషన్ సర్వే చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ రైల్వే అధికారులు.. రైల్వే బోర్డుకు ప్రతిపాదనలను పంపారు. బోర్డు నుంచి క్లియరెన్స్ వస్తే వీటిపై ముందడుగు పడనుంది.
రాష్ట్రంలో నాలుగో మార్గంలో బుల్లెట్ రైల్ కారిడార్: దేశంలో వివిధ నగరాల మధ్య ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు నిర్మించనున్నట్లు కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో మన రాష్ట్రంలో.. రాజధాని అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై కారిడార్, కర్నూలు, అనంతపురం మీదుగా హైదరాబాద్-బెంగళూరు కారిడార్, చిత్తూరు మీదుగా చెన్నై-బెంగళూరు కారిడార్ కలిపి మొత్తం మూడు ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ-విశాఖపట్నం మధ్య కూడా మరో హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. 350 కి.మీ. ఉండే ఈ కారిడార్ ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ మీదుగా వెళ్లేలా చూడనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గరిష్ఠంగా గంటకు 320 కి.మీ. వేగంతో బుల్లెట్ రైళ్లు రెండు నగరాల మధ్య పరుగులు పెడతాయి. అయితే ఈ కారిడార్ అమరావతి-విజయవాడ-విశాఖపట్నం మధ్య ఉండేలా చూస్తే.. హైదరాబాద్-అమరావతి-చెన్నై కారిడార్కు అనుసంధానం అయినట్లు అవుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ