
అమరావతి, 04 మార్చి (హి.స.)
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. ఉదయం 11.30 గంటలకు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలోని తంగుల్గూడా గ్రామంలో ఉన్న రాధాకృష్ణ ఆలయానికి జగన్ చేరుకోనున్నారు. అక్కడ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు వైఎస్ జగన్ విశాఖకు చేరుకుని రాణాప్రతాప్ నగర్లోని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి వెళతారు. ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ఆ తరువాత అక్కడి నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభించనున్నారు. ఇక రేపు వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకు జగన్ వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొననున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ