
కర్నూలు, 04 మార్చి (హి.స.)ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కర్నూలులోని కల్లూరుకు చెందిన శివారెడ్డిగారి వెంకటకృష్ణారెడ్డి ఖతర్లో చిక్కుకుపోయారు. తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా కోదండాపురానికి చెందిన సత్యారెడ్డి పిల్లల చదువు కోసం ముప్పై ఏళ్ల కిందట కర్నూలుకు వచ్చి స్థిరపడ్డారు. ఈయన పెద్ద కుమారుడు వెంకటకృష్ణారెడ్డి కర్ణాటకలో డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదివారు. కెనడాకు వెళ్లి ఎంఎస్ పూర్తిచేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన ఆయన పెళ్లికి తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో గతనెల 28న కెనడా నుంచి ఇండియాకు తిరిగొచ్చే క్రమంలో ఖతర్ ఎయిర్పోర్టులో ఆగారు. ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం కారణంగా అక్కడ విమానాలు నిలిపివేశారు. దీంతో ఎయిర్పోర్టు సమీపంలోని ఓ హోటల్లో ఆయనకు బస ఏర్పాటు చేశారు.
యుద్ధం ఎప్పటి వరకు కొనసాగుతుందో.. విమాన సర్వీసులు ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియకపోవడంతో ఆయనతో పాటు కర్నూలులోని అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈసందర్భంగా సత్యారెడ్డి మాట్లాడుతూ.. ఖతర్లో ఉన్న తన కుమారుడు ఫోన్లో అందుబాటులో ఉన్నారని, తమతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. అక్కడి అధికారులు హోటల్ నుంచి బయటకు రానివ్వకపోవడంతో బయట ఏం జరుగుతుందో తెలియక తన కుమారుడు ఆందోళనలో ఉన్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని తన కుమారుడిని సురక్షితంగా ఇండియాకు చేర్చాలని ఆయన కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ