
హైదరాబాద్, 04 మార్చి (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగిలో వరి సాగు పెరుగుతోంది. ఈ రబీలో 63 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. గత సీజన్ కంటే 2.72 లక్షల ఎకరాలకు పైగా సాగు పెరిగిందని, పంట ఉత్పత్తి కూడా 145 లక్షల మెట్రిక్టన్నులు వస్తుందని అంచనా వేస్తోంది. ధాన్యం సేకరణ కూడా ఈసారి 90 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసేందుకు ప్లాన్చేస్తుంది. ఉగాది పండుగ తర్వాత వరి పంటలు కోతకు రానుండగా ఏప్రిల్రెండో వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు పౌరసరఫరాల శాఖ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్సర్కార్ హయాంలో ధాన్యం దిగుబడి పెద్దమొత్తంలో వస్తుండగా వానాకాలం సీజన్లో పౌరసరఫరాల శాఖ 72 లక్షల మెట్రిక్టన్నులు ధాన్యం కొనుగోలు చేసి దేశంలో వరి సేకరణలో టాప్లో నిలిచింది. సన్నాల అమ్మకాలు చేసిన రైతులకు ఇప్పటివరకు బోనస్ రూ.1939 కోట్లు చెల్లించి అన్నదాతల నుంచి ప్రభుత్వం ప్రశంసలు అందుకుంది.
2023-24లో 52.17 లక్షల ఎకరాలు వరి సాగు చేయగా 115 లక్షల మెట్రిక్గా ధాన్యం ఉత్పత్తి అయింది.
2024-25 లో 60.28 లక్షల ఎకరాలు సాగు కాగా 137 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. 2025-26 ఏడాదిలో 63 లక్షల ఎకరాలు వరి వేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి గత రబీ కంటే 8 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ ఉత్పత్తి కానున్నట్లు ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపారు. దీంతో పంట ఉత్పత్తిని పరిగణలోకి తీసుకుని పౌరసరఫరాల కోనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు శాఖ సిద్ధమైంది.అందుకోసం తాత్కాలికంగా రుణం తీసుకుంటుంది. గతంలో జరిగిన అనుభవాలు దృష్టిలో పెట్టుకుని కేంద్రాల్లో ఇబ్బందులు రాకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు సివిల్సప్లయి అధికారులు వెల్లడించారు.
నాసిరకంపై ఫోకస్
రాష్ట్ర ప్రభుత్వం రేషన్లబ్దిదారులతో పాటు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. వాటికి సరఫరా చేసే విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన బియ్యం సక్రమంగా లేకపోవడం, వండిన రైస్ ముద్దలుగా ఉండటంతో విద్యార్ధులు తినలేకపోతున్నారు. దీంతో అలాంటి పరిస్థితులు రాకుండా ధాన్యం సేకరణ సక్రమంగా నిర్వహించాలని పౌరసరఫరాల శాఖ ప్రణాళికలు చేస్తోంది. అదే విధంగా సీఎంఆర్రిస్నాసిరకంగా లేకుండా.. ప్రభుత్వం మిల్లులకు ఇచ్చిన ధాన్యం నుంచి వచ్చే బియ్యానే తీసుకునేలా తనిఖీలు చేపట్టనుంది. పేదలకు సన్నబియ్యం పంపిణీలోనూ అక్రమాలకు చోటు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక గత రబీ సీజన్ బోనస్పెండింగ్లో ఉండగా వీలైనంత త్వరగా నగదు జమ చేయాలని పౌరసరఫరాల శాఖను ఆర్థిక శాఖ కోరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు