
తిరుమల, 04 మార్చి (హి.స.)
భారత్ లో పాక్షిక చంద్రగ్రహణం పూర్తికావడంతో తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. అర్చకులు మహాద్వారం, గర్భాలయ తలుపులను తెరిచి శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ శుద్ధి పుణ్యాహవచనం అనంతరం 8.30 గంటల నుంచీ భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటలకే శ్రీవారి ఆలయాన్ని మూసివేయగా.. గ్రహణం పూర్తయ్యాక రాత్రి 7.30 గంటలకు తలుపులను తెరిచారు. శ్రీవారి ఆలయంతో పాటు.. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాలను కూడా తెరిచి, శుద్ధి చేస్తున్నారు.
కాగా.. మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమైన గ్రహణం.. సాయంత్రం 6.47 గంటలకు పూర్తయింది. జపాన్, ఆస్ట్రేలియా దేశాల్లో సంపూర్ణంగా కనిపించిన గ్రహణం.. భారత్ లో కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా కనువిందు చేసింది. గ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపించగా.. బ్లడ్ మూన్ ను చూసిన ప్రజలు కొత్త అనుభూతి పొందామని చెప్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV