
న్యూఢిల్లీ, 08 మార్చి (హి.స.)
భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) సుమారు 18,300 కోట్ల విలువైన మెట్రో ప్రాజెక్టుల (Metro project)కు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ మెట్రోలో రెండు కొత్త కారిడార్లను ఆయన జాతికి అంకితం చేశారు. ఇందులో సుమారు 12.3 కిలోమీటర్ల పొడవున్న మజ్లిస్ పార్క్ మౌజ్పూర్ బాబర్పూర్ (పింక్ లైన్) కారిడార్తో పాటు, 9.9 కిలోమీటర్ల పొడవైన దీపాలీ చౌక్ - మజ్లిస్ పార్క్ (మెజెంటా లైన్) కారిడార్లు అందుబాటులోకి వచ్చాయి. రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేశారు.
ఈ నూతన మెట్రో మార్గాల వల్ల ఢిల్లీలోని బురారీ, జగత్పూర్-వజీరాబాద్, ఖజూరి ఖాస్, భజన్పురా, యమునా విహార్, మధుబన్ చౌక్ వంటి అనేక కీలక ప్రాంతాల ప్రజలకు గొప్ప ఊరట లభించనుంది.. అంతేకాకుండా హైదర్పూర్ బాధీ మోర్, భల్వాస్వా-మజ్లిస్ పార్క్ వంటి ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపడటంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. రాజధాని నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం తో పాటు పర్యావరణ హితమైన రవాణా సౌకర్యాలను పెంపొందించడంలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు