
కర్నూలు, 08 మార్చి (హి.స.)
వేసవి సీజన్లో లభ్యమయ్యే తాటి ముంజల గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ ముంజల్లో ఎన్నో పోషక విలువలున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం అనంతపురం, కర్నూలు నగరంలోని ఆయా కూడళ్లలో వీటిని విక్రయిస్తున్నారు.తాటి ముంజలు విక్రయించి కొందరు ఉపాధి పొందుతున్నారు.
తాటి ముంజలకు భలే గిరాకీ...
వేసవిలో చల్లదనం కలిగించే తాటి ముంజలను కొనుగోలు చేసేందుకు అనంతపురం, కర్నూలు నగరంలోని శివారు ప్రాంతాలలోని ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కొందరు వ్యాపారులు మార్కెట్లో, రోడ్ల పక్కన పెట్టుకుని అమ్ముతుండగా.. మరికొందరు ద్విచక్ర వాహనాలు, సైకిళ్లు, తోపుడుబండ్ల మీద తిరిగి అమ్ముతున్నారు. ముంజల్లో దాహర్తిని తీర్చె సుగుణాలే కాదు ఆరోగ్యాన్నిచ్చే పోషకాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తుండడంతో ముంజల అమ్మకాలు ఊపందుకున్నాయి. ముంజలను డజను 150 నుంచి 200కి వ్యాపారులు విక్రయిస్తున్నారు.
ఔషధ గుణాలివే..
తాటి ముంజలు వేసవిలో ఒళ్లు మంటల నుంచి ఉపశమనం కలిగించడే కాదు శరీరానికి జల సమతుల్యం చేస్తాయి. వీటిలో పుష్కలమైన మినరల్స్, విటమిన్లు ఉన్నాయి. డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి. జలపదార్థం అధిక మోతాదులో ఉండడంతో దాహర్తిని తీర్చి, ఆకలిని తీర్చుతాయని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. వంద గ్రాముల ముంజల్లో 29 కేలరీల శక్తి, తేమ- 99 శాతం, ప్రొటీన్లు - 1 గ్రాము, పిండిపదార్థాలు - 6 గ్రాములు, కాల్షియం - 10 మిల్లిగ్రాములు, పాస్పరస్ - 2 మిల్లిగ్రాములు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. తాటి ముంజలు తినడం వల్ల శరీరానికి చల్లదనమే కాకుండా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
మార్చి , ఏప్రిల్, మే నెలల్లో ఇవి విరివిగా లభిస్తాయి. పిల్లల నుండి పెద్దల దాకా అందరూ వీటిని ఇష్టంగా తింటారు. అయితే ఈ ఎండా కాలంలో కొందరికి ఈ తాటి ముంజలు ఉపాధిని కూడా ఇస్తున్నాయి. కొందరు యువకులు ఈ తాటి ముంజలను విక్రయిస్తూ సీజనల్గా ఉపాధిని కూడా పొందుతున్నారు. నిర్మల్ జిల్లా కడెం, ఖానాపూర్ మండలాల్లో తాటి చెట్లు బాగా ఉన్నాయి. ఇక్కడి నుండి కొందరు హోల్సేల్గా తాటి కాయలను కొనుగోలు చేసుకొని తీసుకొని ఆదిలాబాద్ పట్టణంలోని రైతు బజార్, పలు ఇతర ప్రధాన కూడళ్లలో, రోడ్డు పక్కన వాటిని పెట్టి అప్పటికప్పుడు వాటి నుండి లేత తాటి ముంజలను కోసి ఇస్తున్నారు. డజను తాటి ముంజలు 120 రూపాయల ధర పలుకుతున్నాయి.
తాటి ముంజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తాటి ముంజలు శరీరంలో వేడిని తగ్గించి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. అంతే కాకుండా తాటి ముంజలు తినడం వల్ల మలబద్ధకం సమస్యలు తొలగిపోయి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తాటి గింజలు క్యాన్సర్ కణాలను కూడా నివారిస్తాయి. ముంజల్లో ఐరన్, క్యాల్షియం వీటిల్లో పుష్కలంగా ఉంటాయి. విటమిన్-ఎ, బి, సిలతో పాటు జింక్, పొటాషియం, ఫాస్ఫరస్లు కూడా అధికంగా ఉంటాయి. వేసవిలో రోజూ తాటి ముంజలు తింటే వడదెబ్బ తగలనీయకుండా బయటపడవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV