
న్యూఢిల్లీ, 08 మార్చి (హి.స.) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాళ్ పర్యటనలో ప్రొటోకాల్ వివాదం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఓ ఆదివాసి మహిళ అయిన రాష్ట్రపతికి బెంగాల్ ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించకుండా అవమానం చేసిందని సీఎం మమతా బెనర్జీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లినప్పుడు, ప్రొటోకాల్ ప్రకారం ఆమెకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ఉన్నతాధికారులు సరైన క్రమంలో హాజరు కాలేదని ఆరోపణలు వచ్చాయి. దేశ ప్రథమ పౌరురాలికి జరగాల్సిన గౌరవ మర్యాదల్లో లోపం జరిగిందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
బెంగాల్ సీఎస్కు నోటీసులు
ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, దీనిపై వివరణ ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) కి నోటీసులు జారీ చేసింది. ప్రొటోకాల్ ఎక్కడ విఫలమైంది? బాధ్యులెవరు? అనే అంశాలపై నివేదిక కోరింది. అలాగే రాష్ట్రపతి పర్యటనల సమయంలో కఠినమైన భద్రత, ప్రోటోకాల్ నిబంధనలు ఉంటాయి. వాటిని పాటించకపోవడం రాజ్యాంగపరమైన నిబంధనల ఉల్లంఘన గా పరిగణిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..