
కడప, 01 ఏప్రిల్ (హి.స.) ఏడురోడ్లు, ఖాజీపేట,-ఊరిలో ఉండేది 692 ఇళ్లు. నివసించేది 2,419 మంది ప్రజలు. అయితేనేం దేశ వ్యాప్తంగా ఉన్న 2.5 లక్షలకు పైగా పంచాయతీలతో పోటీ పడింది. పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు కల్పన, స్వయం సహాయక సంఘాల బలోపేతం, పారదర్శక పాలనలో శెభాష్ అనిపించుకుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ద్వితీయ అవార్డు దక్కించుకుని జాతీయ స్థాయిలో మెరిసింది.
:మార్చి 9న కేంద్ర బృందం ఖాజీపేట మండలంలోని చెముళ్లపల్లెలో పర్యటించింది. అనేక అంశాలను పరిశీలించింది. గ్రామస్థులతో మమేకమైంది. ‘పేదరిక నిర్మూలన-మెరుగైన జీవనోపాధుల కల్పన’లో జాతీయ స్థాయిలో ద్వితీయ అవార్డుకు ఎంపిక చేసింది. ఇందుకుగాను చెముళ్లపల్లె పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుంది. ఆ పంచాయతీ ఖాతాలో రూ. 75 లక్షలు జమ చేయనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి వెంకట సుబ్బయ్య తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ