
అమరావతి, 13 ఏప్రిల్ (హి.స.)పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను బకాయిలపై ఆస్తిపన్ను బకాయిలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 31 మార్చి 2026 నాటికి ఉన్న బకాయిలపై వడ్డీలో 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ రాయితీని పొందాలంటే బకాయి మొత్తం(ప్రిన్సిపల్) పూర్తిగా చెల్లించి, మిగిలిన 50 శాతం వడ్డీని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆస్తిపన్ను చెల్లించని వారికి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవాలి.
సీడీఎమ్ఏ కమిషనర్ సంపత్ కుమార్ సూచనల మేరకు.. ఈ రాయితీ అమలు ఏప్రిల్ 30, 2026 వరకు మాత్రమే ఉండనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలపై మాత్రమే 50 శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుంది. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఏప్రిల్ 30, 2026 లోపు ముందస్తుగా మొత్తం చెల్లించేవారికి 5 శాతం అదనపు రాయితీ కూడా లభిస్తుంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలోనూ రాయితీ అమలులో ఉండనుంది. పట్టణాభివృద్ధికి పన్నులు చెల్లించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఆలస్యం చేయకుండా వెంటనే సమీప మున్సిపల్ కార్యాలయం, ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆస్తి పన్ను చెల్లించి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్