
జగిత్యాల, 14 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో
కరువు వస్తే, అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), కాంగ్రెస్ పార్టీయే కారణమవుతారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జగిత్యాలలోని బీఆర్ఎస్ నేత హరిచరణ్ రావు ఆహ్వానం మేరకు ఆయన నివాసంలో అల్పాహారం చేసిన అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకోవాలంటే తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని, కానీ ఆ దిశగా రేవంత్ ప్రభుత్వానికి చొరవ లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేడిగడ్డ ప్రాజెక్టును పునరుద్ధరించుకోవడం ఒక్కటే మార్గమని, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆ పనులు పూర్తి చేయాలని సూచించారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే కేసీఆర్ (KCR)ను దోషిగా చూపారని, కానీ ఆయన తెలంగాణ పునర్నిర్మాణానికి స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు. ఇప్పటికే మూడు వ్యవసాయ కాలాలు గడిచిపోయాయని, మేడిగడ్డ పునరుద్ధరణ వీలైనంత త్వరగా చేపట్టకపోతే రైతులకు నష్టం తప్పదన్నారు. భవిష్యత్తులో కరువు వస్తే దానికి జవాబుదారీ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీయేనని జీవన్ రెడ్డి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు