
భద్రాద్రి కొత్తగూడెం, 14 ఏప్రిల్ (హి.స.)
అంబేద్కర్ ఆశయాలు యువత స్ఫూర్తి కావాలని జిల్లా కలెక్టర్ అంకిత అన్నారు. మంగళవారం కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ ప్రధాన కూడలిలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రజలు స్వయంగా పరిపాలించుకునే విధంగా రాజ్యాంగం అవసరమైందని, దేశ వ్యాప్తంగా అనేక మంది మేధావులలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించ గల వ్యక్తిగా గుర్తించబడినట్లు తెలిపారు. భారత రాజ్యాంగం రూపకల్పనలో ఆయన చేసిన కృషి అపూర్వమని, విద్య, ఆర్థిక, నీటిపారుదల తదితర రంగాల్లో ఆయన చూపిన దూరదృష్టి దేశాభివృద్ధికి పునాది అయిందన్నారు.
భారత రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు లభించాయని, “ఒక వ్యక్తి ఒక ఓటు అనే సూత్రాన్ని స్థిరపరచిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని అన్నారు . కుల, మత భేదాలకు అతీతంగా సమానత్వ భావనను నెలకొల్పిన ఆయన ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు . అనంతరం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. విభిన్న కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు కలిగిన దేశం అయినప్పటికీ భారతదేశం ఐక్యంగా నిలబడటానికి ప్రధాన కారణం రాజ్యాంగమని అన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత రాజ్యాంగం చాలా తక్కువ సవరణలతోనే సమర్థవంతంగా కొనసాగుతుండటం అంబేద్కర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు.
సమాజంలో మానవతా విలువలకు ప్రాధాన్యం ఇస్తూ, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమానంగా జీవించేలా కృషి చేయాలని, అంబేద్కర్ స్ఫూర్తిని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల గోడ పత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్-అలైవ్ (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రహదారుల భద్రతపై ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం, హెల్మెట్ మరియు సీట్బెల్ట్ వినియోగాన్ని తప్పనిసరిగా అనుసరించడం, మద్యపానం చేసి వాహనం నడపక పోవడం, వేగ నియంత్రణ పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజల ప్రాణ రక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు సామూహికంగా కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ జడ్పీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు