జీతాలు పెంచాలంటూ నిరసన-నోయిడాలో తీవ్ర ఉద్రిక్తత
జీతాలు పెంచాలంటూ ఓప్రైవేట్ కంపెనీ కార్మికులు నిరసనలు చేపట్టారు
జీతాలు పెంచాలంటూ నిరసన-నోయిడాలో తీవ్ర ఉద్రిక్తత


నోయిడా, 13 ఏప్రిల్ (హి.స.)

ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా నోయిడాలో సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేతనాల పెంపు డిమాండ్తో ఓ ప్రైవేట్ కంపెనీ కార్మికులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. యాజమాన్యంపై ఆగ్రహించిన కార్మికులు.. కంపెనీలోని ఓ కారుకు నిప్పుపెట్టడంతో పాటు, పోలీసులపై రాళ్లు రువ్వారు. వివరాల్లోకి వెళితే.. నోయిడా ఫేజ్-2లోని ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన వందలాది మంది కార్మికులు జీతాలు పెంచాలంటూ కంపెనీ గేటు వద్ద ఆందోళనకు దిగారు. యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలోనే వారు హింసకు పాల్పడ్డారు.

ఆందోళనకారులు కంపెనీ ప్రాంగణంలో పార్క్ చేసి ఉన్న ఓ కారుకు నిప్పుపెట్టారు. అనంతరం ఫ్యాక్టరీ భవనంతో పాటు, అక్కడికి చేరుకున్న పోలీసులపైకి రాళ్లు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించి గుంపును చెదరగొట్టారు. ఈ ఘర్షణలో కొందరు పోలీసులకు, కార్మికులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, హింసకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు స్థానిక పోలీసులను భారీగా మోహరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande