
అమరావతి, 14 ఏప్రిల్ (హి.స.): కల్తీల కట్టడికి కేంద్రం ఊతమిచ్చినా వినియోగించుకోలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. తిరుపతి, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం జోన్లకు వైకాపా ప్రభుత్వంలో నాలుగు ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ సంచార వాహనాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఎన్నికలకు ముందు 2024 మార్చిలో వచ్చిన ఈ వాహనాలను వినియోగంలోకి తేలేదు.
ఆ తర్వాత ప్రభుత్వం మారినా వీటిని పట్టించుకునే పరిస్థితి లేదు. దిల్లీ నుంచి ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనాలు రాష్ట్రానికి వచ్చి రెండేళ్లయినా నేటికీ రిజిస్ట్రేషన్కు చొరవ చూపలేదు. వాహనానికి డ్రైవర్తోపాటు ఆహార నాణ్యత విశ్లేషించే నిపుణుడు, ల్యాబ్ సహాయకుడి పోస్టులనూ కేటాయించలేదు. కనీసం ఇంధనం, వాహనాల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో వాహనాలు పడకేశాయి. అధునాతన పరీక్షా పరికరాలు, సౌకర్యాలతో కదిలే ప్రయోగశాలలతో కూడిన రూ.కోట్ల విలువైన ఈ ఆహార భద్రతా శకటాల్ని నిర్లక్ష్యంగా వదిలేశారు.
ఆహార భద్రత- ప్రమాణాల శాఖ (ఐపీఎం)లో కనీస పర్యవేక్షణ లేక కల్తీలకు అడ్డుకట్ట పడడంలేదు. కనీసం ఈ సంచార వాహనాలైనా అందుబాటులోకి తెస్తే సంతలు, వ్యాపార సముదాయాలున్న చోట కల్తీలతో వచ్చే అనర్థాలపై చైతన్యం తీసుకురావచ్చు.
తినే ఆహారంలో ఏది నాణ్యమైనదో, ఏది నాసిరకమో చెప్పలేని పరిస్థితి. ప్రజారోగ్యానికి కల్తీలు సవాలుగా మారుతున్నా కట్టడి చర్యలు తేలిపోతున్నాయి. వైద్యారోగ్య శాఖలోని ఐపీఎం విభాగంలో అప్రమత్తత కనిపించడం లేదు. ప్రజారోగ్యంతో ముడిపడిన ఈ కీలక విభాగంలో 579 ఖాళీలు వేధిస్తున్నాయి. ఉన్నవారు సైతం కనీస స్థాయిలో పనిచేయడం లేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ