
తిరుపతి, 14 ఏప్రిల్ (హి.స.)
వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు పోటెత్తే భక్తుల రద్దీ దృష్ట్యా తితిదే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మే 1 నుంచి వీఐపీ దర్శనాలతో పాటు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనుసరించిన నమూనాను అమలు చేయాలని భావిస్తోంది. దీనిపై తితిదే ఉన్నతాధికారులు గత మూడేళ్ల వేసవి కాల డేటాను విశ్లేషిస్తున్నారు. మూడేళ్ల గణాంకాల ప్రకారం.. మే, జూన్, జులై నెలల్లో ప్రతినెలా సగటున 23-24 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం వీఐపీ దర్శనాలకు రోజూ 2-3 గంటల సమయం కేటాయిస్తున్నారు. ఈ సమయంలో 3,800 మంది వీఐపీలు మాత్రమే స్వామిని దర్శించుకుంటున్నారు. ఆ మూడు గంటల సమయాన్ని సామాన్యులకు కేటాయిస్తే ఏకంగా 15 వేల మందికి దర్శనభాగ్యం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలను బేరీజు వేసుకుంటున్న బోర్డు.. వేసవిలో వీఐపీ దర్శనాలను రద్దు చేయడమే సరైన చర్యగా భావిస్తోంది. ప్రస్తుతం ఎస్ఎస్డీ విధానంలో దర్శనానికి 22-23 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. వివిధ దర్శనాల కేటగిరీలన్నింటినీ పక్కనపెట్టి, వైకుంఠ ఏకాదశి తరహా విధానాన్ని అమలు చేయడం ద్వారా నిరీక్షణ సమయం 8-12 గంటల వరకు తగ్గుతుందని అధికారులు అంచనా. ఈ పద్ధతిలో రోజుకు సగటున 80 వేల మందికి స్వామివారి దర్శనభాగ్యం కల్పించవచ్చని భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ