
నాసిక్, 17 ఏప్రిల్ (హి.స.)
దేశవ్యాప్తంగా కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ యూనిట్లోని బలవంతపు మత మార్పిడి, లైంగిక వేధింపుల కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటూ, పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్న హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ అరెస్ట్ భయంతో నాసిక్ జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను గర్భవతినని, మానవతా దృక్పథంతో తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని ఆమె తన పిటిషన్లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కేసులో నిదా ఖాన్ పాత్ర అత్యంత కీలకమని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) భావిస్తోంది. బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు వారిని బెదిరించడం, నిందితులైన సీనియర్లకు కొమ్ము కాయడంలో ఆమెదే ప్రధాన పాత్ర అని ఆరోపణలున్నాయి. సిట్ బృందాలు ఆమె కోసం ముంబై, ఇతర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తుండగానే, ఆమె న్యాయవాదుల ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi