
న్యూఢిల్లీ, 17 ఏప్రిల్ (హి.స.)
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో
భాగంగా నియోజకవర్గాల (Delimitation), పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ బిల్లు మహిళా సాధికారత కోసం తెచ్చింది కాదని, దేశం ఆత్మను చంపే ప్రయత్నమని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రసంగం ప్రారంభంలో మహిళల ప్రాముఖ్యతను వివరిస్తూ రాహుల్ గాంధీ భావోద్వేగానికి లోనయ్యారు.
సమాజంలో మహిళలది కీలక పాత్ర. నిన్న సభలో నా సోదరి ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగం చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా అనిపించింది. మా నానమ్మ ఇందిరా గాంధీ నాకెంతో స్ఫూర్తి. సత్యం, అహింసల గురించి ఆమె చెప్పిన మాటలే నాలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపాయి అని స్మరించుకున్నారు.
ప్రస్తుత బిల్లులోని లోపాలను ఎండగడుతూ రాహుల్ విరుచుకుపడ్డారు. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. మళ్లీ అదే పాత బిల్లును కొత్త వేషంలో తీసుకురావడం మహిళలను అవమానించడమే. తక్షణమే పాత బిల్లునే అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం కంటే మనువాదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది అని విమర్శించారు. ఈ బిల్లు వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పునర్విభజన సాకుతో దక్షిణాది, ఈశాన్య మరియు చిన్న రాష్ట్రాల హక్కులను కేంద్రం లాక్కుంటోందని రాహుల్ ఆరోపించారు. బీజేపీ దేశంలో శాశ్వతంగా అధికారంలో ఉండాలని కుట్రలు చేస్తోంది. మహిళా రిజర్వేషన్ల పేరుతో ప్రధాని మోదీ ఇంద్రజాలం (Magic) చేస్తున్నారు. హిందువుల పార్టీ అని చెప్పుకుంటూ హిందువులనే మోసం చేస్తున్నారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో అధికార బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున అడ్డుతగిలారు. ఆయన ప్రసంగంలోని కొన్ని పదాలపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ మర్యాదలు పాటించాలని సూచించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని రాహుల్.. దేశ ఆత్మను చంపే ఇలాంటి ప్రయత్నాలను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు