పార్లమెంట్లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
Amaravathi bill


న్యూఢిల్లీ, 02 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం.. రాష్ట్రపతికి పంపనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదలకానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజ్యసభ చైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్ కావడంతో రాజధాని అమరావతిలో సంబరాలు మిన్నంటాయి.

రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి. 17 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. అయితే రాజ్యసభలో సైతం ఈ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది.

కూటమి ఎంపీలకు లోకేశ్ అభినందనలు..

అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంతో కూటమిలోని పార్టీల ఎంపీలకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన పలు పార్టీల నాయకులకు లోకేశ్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను స్వయంగా కలిసి మంత్రి నారా లోకేశ్తోపాటు కూటమి ఎంపీలు ధన్యవాదాలు తెలిపారు.

మోకాళ్లపై నిలబడి ధన్యవాదాలు తెలిపిన అమరావతి రైతులు

రాజధాని అమరావతి బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందడంతో రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. మోకాళ్ళపై నిలబడి పార్లమెంటులో ఈ బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలకు వారు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు రాజధాని ప్రాంత రైతులు పాలాభిషేకం చేశారు. దాంతో ఆ ప్రాంతంలోని ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande