
జయశంకర్ భూపాలపల్లి, 02 ఏప్రిల్ (హి.స.)భూపాలపల్లి కలెక్టరేట్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కాంట్రాక్టర్పై కలెక్టరేట్ ఉద్యోగి దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అడిగేందుకు కలెక్టర్ కార్యాలయానికి కాంట్రాక్టర్ వీరేందర్ వెళ్లాడు. అసిస్టెంట్ పే అకౌంట్ ఆఫీసర్ (ఏపీఏవో) ఫణి భూషణ కశ్యప్ను కలిసి తన గోడు వెల్లబోసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నానని పెండింగ్ బిల్లులు ఇప్పించాలని కోరాడు.
బిల్లులు చెల్లించాలని అడిగిన అతనిపై బూతు పురాణం మెుదలెట్టారు కశ్యప్. కలెక్టరేట్లో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న విషయం మరిచి వీధి రౌడీలా బూతులు తిట్టడం మెుదలెట్టారు. అది చాలదన్నట్లు టేబుల్పై ఉన్న వస్తువులతో కాంట్రాక్టర్పై ఏపీఏవో దాడి చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్కు ముఖానికి గాయాలు అయ్యాయి. భూపాలపల్లి కలెక్టరేట్ ఉద్యోగి తనపై దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్