
జనగామ, 02 ఏప్రిల్ (హి.స.)
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ
పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం తరిగొప్పుల మండలం తరిగొప్పుల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. మొదట రాష్ట్ర గీతాన్ని ఆలపించి, ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ తమ శాఖల పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాల వివరాలను గ్రామ ప్రజలకు వెల్లడించారు.
ఈ సందర్భంగా పథకాల లబ్ధిదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రభుత్వ సహాయం వల్ల తమ జీవన స్థితి మెరుగుపడిందని తెలిపారు. గ్రామ ప్రజల సమస్యలను కలెక్టర్ నేరుగా తెలుసుకొని, వాటిని సంబంధిత శాఖల అధికారులు నమోదు చేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలోనే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించిన కలెక్టర్, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
రైతు భరోసా, గృహ జ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం కీలకమని, పరిశుభ్రత, పిల్లల విద్య, ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు